చర్మసౌదర్యం
చర్మం మన దేహానికి బాహ్య రక్షణ కవచం. అంతేకాదు మనల్ని అందంగా చూపించేదీ ఇదే. ఇది చాలా సున్నితమైంది కూడా. అందుకే బాహ్యంగా జరిగే ఎన్నో రకాల మార్పులకు, ప్రభావాలకు ఇది లోనవుతూ ఉంటుంది. కనుక ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు, నివారణ చర్యలతోనే చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. - అందరి ఇళ్లలోనూ వ్యాజిలైన్ తప్పకుండా ఉంటుంది. దీనితో ఎన్నో రకాల చర్మ సమస్యలకు అడ్డుకట్ట వేయవచ్చు. పాదాల పగుళ్లతో బాధపడేవారు వ్యాజిలైన్‌ను ప్రతిరోజూ రాత్రి రాసుకున్నట్లయితే పగుళ్లు పోయి పాదాలు అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తాయి.
- పాదాలే కాదు చర్మంలో ఎక్కడ పగుళ్లు ఏర్పడినా వ్యాజిలైన్ మంచి నివారిణిగా ఉపకరిస్తుంది. అలాగే చర్మం పొడిబారినట్లుగా ఉంటే దీన్ని రాసుకోవడం మంచిది. ముఖ్యంగా చలికాలంలో ఇది ఎంతో అవసరం.
- చిన్న చిన్న గాయాలు, కాలిన గాయాలపై దీన్ని రాయవచ్చు. సూర్యకిరణాల ప్రభావం నుంచి కూడా ఇది రక్షిస్తుంది.
- ముఖారవిందంలో పెదాల పాత్ర చాలా కీలకం. వాతావరణ ప్రభావంతో సున్నితమైన పెదవులు అంద విహీనంగా మారడం, పగుళ్లివ్వడం జరుగుతుంది. అటువంటి సందర్బాల్లో వ్యాజిలైన్‌ను పెదవులపై రాసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
- గ్రీన్‌టీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని మీకు తెలిసే ఉంటుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో గ్రీన్‌టీ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే వాడేసిన టీ బ్యాగులను కొన్ని నిమిషాల పాటు డీప్‌ఫ్రీజర్‌లో ఉంచి తర్వాత కళ్లపై ఉంచుకోవడం వల్ల క ళ్లు ఎంతో తాజాదనాన్ని సంతరించుకుంటాయి.
- ఇంట్లో ఉపయోగించే బేకింగ్‌సోడా పొడిని ఒక టేబుల్ స్పూన్ తీసుకుని దాన్ని ఫేసియల్ క్లీన్సర్‌తో కలిపి ముఖంపై రెండు నిమిషాలపాటు మర్దన చేసుకోవాలి. బాడీస్క్రబ్‌ని తయారు చేసుకోవడానికి ఒక టేబుల్ స్పూన్ పంచదార, బేకింగ్ సోడా, కోషర్ సాల్ట్, వేడినీళ్లు, తేనె, ఆలివ్ ఆయిల్‌ను తీసుకోవాలి. వీటన్నింటినీ మంచిగా కలుపుకుంటే పేస్ట్‌లా అవుతుంది. దీంతో స్నానం చేయవచ్చు.
- ముఖ్యంగా పొడారినట్లుగా ఉండే మోకాళ్లు, మోచేతులు, మడమలు తదితర ప్రాంతాల్లో ఈ పేస్ట్‌తో రుద్దుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అయితే షేవింగ్ చేసుకున్న తర్వాత ఈమిశ్రమాన్ని వాడకుండా ఉండడం మంచింది.
- దంత సమస్యల్లో కూడా బేకింగ్ సోడాని ఉపయోగించవచ్చు. కొంచెం పొడిని నీటిలో కలుపుకుని ఆ నీటితో నోటిని పుక్కిలించడం వల్ల దంతాలు తెల్లగా మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటాయి.
- చర్మానికి, శిరోజాలకు గుడ్డు వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. మూడు గుడ్లను తీసుకుని వాటిల్లోని తెల్లసొనని వేరుచేసి ఒక కప్పులో తీసుకోవాలి. దాన్ని పాత మేకప్ బ్రష్‌తో ముఖానికి రాసుకోవాలి. అలా కొన్ని నిమిషాల పాటు ఆరే వరకూ ఉంచి తర్వాత కడిగేయాలి.
- కోడిగుడ్డు సొనకు ఆలివ్ ఆయిల్‌ను కలిపి శిరోజాలకు రాసుకోండి. కొన్ని నిమిషాల తర్వాత షవర్ కింద పదిహేను నిమిషాలపాటు అలానే ఉండండి. అంతే తడారిన తర్వాత చూసుకుంటే మీ శిరోజాలు తళ తళ మెరిసిపోతూ అందంగా కనిపిస్తాయి.
- జింక్ ఆక్సైడ్ కూడా చర్మ సౌందర్యం పరిరక్షణలో ప్రధాన పాత్రనే పోషిస్తుంది. జింక్ ఆక్సైడ్ సూర్యకిరణాల ప్రభావానికి లోనుకాకుండా చర్మ సౌందర్యాన్ని పరిరక్షిస్తుంది. సూర్యకిరణాల ప్రభావానికి ఎక్కువగా గురయ్యే ప్రదేశాల్లో దీన్ని రాసుకోవడం ప్రయోజనకరం.
- వెనిగర్, నిమ్మరసం, తేనె, ఆలివ్ ఆయిల్, ఓట్‌మీల్ కూడా చర్మ సౌందర్యాన్ని కాపాడేవే.
- అర కప్పు కొబ్బరినూనెలో కొద్దిగా వేపాకు, పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా కర్పూరం వేసి కాచి, చల్లారిన తరవాత వడకట్టాలి. ఆ నూనెను రాత్రి పడుకునే ముందు కాళ్ల పగుళ్ల మీద అప్లై చేసి రెండు నిమిషాలు మర్దనా చేస్తే ఉపశమనం ఉంటుంది.
- టీ స్పూన్ ఉప్పు, రెండు నిమ్మచెక్కలు వేసిన గోరువెచ్చని నీటిలో పాదాలు 15 నిమిషాల పాటు ఉంచి రిలాక్స్ అయ్యి, మెత్తటి బ్రష్‌తో మడమలపై సుతిమెత్తగా మర్దనా చేయాలి. తడి లేకుండా తుడిచి మాయిశ్చరైజర్‌తో అయిదు నిమిషాలు మర్దనా చేస్తే పగుళ్లు తగ్గి, తమలపాకుల్లా అవుతాయి.