మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాంకు బహుమతులు ఏవీ తీసుకునే అలవాటు లేదు .

CHANNEL HYDERABAD
మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాంకు బహుమతులు ఏవీ తీసుకునే అలవాటు లేదట. ఎంత చిన్న బహుమతినైనా కూడా తీసుకోవడానికి నిరాకరిస్తారట. ఇక తప్పక తీసుకోవాల్సి వస్తే తిరిగి దానికి డబ్బులు పంపించేవారట. ఈ విషయాన్ని కోయంబత్తూరుకు చెందిన సౌభాగ్య ఎంటర్‌ప్రైజెస్ అధినేత వీ ఆదికేశన్ గుర్తు చేసుకున్నారు.

‘2014వ సంవత్సరంలో మేం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి కలాం హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన వెళ్లిపోయే సమయంలో బహుమతిగా ఓ గ్రైండర్ ఆయనకు ఇచ్చాం. మొదట దాన్ని తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. అయితే తన కుటుంబానికి గ్రైండర్ అవసరముందని చెప్పి తీసుకెళ్లారు. అయితే తర్వాతి రోజే ఓ వ్యక్తితో రూ.4,850/- చెక్కు పంపించారు. దానిని తీసుకున్ననేను బ్యాంకులో వేయకుండా దాచుకున్నా. ఓ నెల తర్వాత కలాం ఫోన్ చేసి చెక్ ఎందుకు డిపాజిట్ చేయలేదని అడిగారు. దాచుకుంటానని సమాధానం చెప్పడంతో.. అయితే గ్రైండర్‌ను వెనక్కి పంపించేస్తానని బెదిరించారు. రోజూ ఫోన్ చేసి అడిగేవారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో చెక్ డిపాజిట్ చేశాన’ని చెప్పారు కేశవన్. అయితే దానిని స్కానింగ్ తీయించి ఫ్రేమ్ కట్టించి తన షాపులో భద్రపరుచుకున్నాని తెలిపారు. అలాంటి మహోన్నత వ్యక్తి మరణం తనను ఎంతో కలిచివేసిందని కేశవన్ ఆవేదన వ్యక్తం చేశారు.