B.P medicines not working(బీపీ మందులు పనిచేయటం లేదా? )

CHANNEL HYDERABAD

ప్ర : నాకు డాక్టర్లు బి.పి.మందులు రకరకాలు గా మారుస్తున్న నా బి.పి. కంట్రోల్ అవడము లేదు . కారణమేమిటి?
జ : కొందరికి మందులు వేసుకుంటున్నా రక్తపోటును పరీక్షిస్తే ఎక్కువగానే కనబడుతుంది. మరికొందరికి మందులను మార్చినా రక్తపోటు అదుపులోకి రాదు. ఇందుకు మన ఆహార అలవాట్లతో పాటు రకరకాల అంశాలు దోహదం చేస్తాయి.
* 'కంగారు' పోటు : కొందరు డాక్టర్‌ దగ్గరికి వెళ్లగానే తెగ ఆందోళన పడిపోతుంటారు. ఆ కంగారు మూలంగా ఆసుపత్రిలో రక్తపోటును కొలిచినపుడు ఎక్కువగా కనిపిస్తుండొచ్చు. ఇలాంటివాళ్లు ఆదరా బాదరాగా కాకుండా కాస్త ముందుగానే ఆసుపత్రికి చేరుకోవటం మంచిది. కొద్దిసేపు విశ్రాంతిగా కూచొని, దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ సిఫారసు ప్రకారం.. రక్తపోటును కొలవటానికి ముందు కనీసం ఐదు నిమిషాల సేపైనా విశ్రాంతిగా కూచోవాలి.
*మందులు సరిగా వేసుకోకపోవటం: చాలామంది అధిక రక్తపోటు మందులు వేసుకోవటాన్ని తరచుగా మరచిపోతుంటారు. కొందరు సరైన మోతాదులో సరైన సమయంలో వేసుకోరు కూడా. ఫలితంగా మందుల ప్రభావం పూర్తిస్థాయిలో కనబడదు. ఇక నొప్పి తగ్గటానికి వేసుకునే ఎన్‌ఎస్‌ఏఐడీలు, గర్భనిరోధక మాత్రలు, ముక్కు దిబ్బడ తొలగించే మందుల వంటివీ అధిక రక్తపోటు మందుల పనితీరుపై ప్రభావం చూపొచ్చు. కాబట్టి డాక్టర్‌ దగ్గరికి వెళ్లినపుడు తాము వేసుకునే ఇతర మందుల గురించి కూడా చెప్పటం మంచిది.
* సరిగా పరీక్షించకపోవటం: రక్తపోటును కొలిచే సమయంలో కూచునే విధానం సరిగా లేకపోయినా కూడా కొలతలల్లో తేడాలు కనిపించొచ్చు. అందువల్ల బీపీని పరీక్షించేటప్పుడు వెన్నును కుర్చీ వెనక భాగానికి ఆనించి నిటారుగా కూచోవాలి. పాదాలను నేలకు పూర్తిగా ఆనించి ఉంచాలి. చేతిని ముందుకు చాచినపుడు అది గుండెకు సమానమైన ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. అలాగే చేతికి చుట్టే పట్టీ కూడా సరైన సైజులో ఉండాలి. అప్పుడే రక్తపోటు కొలత సరిగా తెలుస్తుంది.
*ఉప్పు ఎక్కువ తినటం: రక్తపోటు నియంత్రణలో ఉప్పు కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల అధిక రక్తపోటు బాధితులు రోజుకి ఉప్పు (సోడియం) వాడకాన్ని 2.3 గ్రాముల కన్నా మించకుండా చూసుకోవాలి. అప్పడాలు, పకోడీల వంటి చిరుతిళ్లలో ఉండే ఉప్పు కూడా ఇందులోని భాగమే. భోజనం చేసేటప్పుడు అదనంగా ఉప్పు వాడటం తగదు. హోటళ్లలో గానీ బయట ఎక్కడైనా గానీ తింటున్నప్పుడూ దీన్ని గుర్తుంచుకోవాలి. అలాగే పండ్లు, కూరగాయలు, పొట్టుతీయని ధాన్యాలు, తేలికైన ప్రోటీన్‌ కూడా తీసుకోవటం మరవరాదు.
*బరువు నియంత్రణలో లేకపోవటం: అధిక బరువును తగ్గించుకోవటం, క్రమం తప్పకుండా శారీరకశ్రమ.. వ్యాయామం చేయటం, మద్యం అలవాటు ఉంటే పరిమితం చేసుకోవటం వంటివి అధిక రక్తపోటు అదుపులో ఉండటానికి తోడ్పడతాయి. పొగ అలవాటును మానెయ్యటం మంచిది. దీంతో గుండె ఆరోగ్యమూ మెరుగుపడుతుంది.
*ఇతర జబ్బులు: థైరాయిడ్‌ జబ్బులు, నిద్రపోతున్నప్పుడు శ్వాసలో అడ్డంకి వంటి సమస్యలు అధిక రక్తపోటుపై ప్రభావం చూపే అవకాశముంది. కాబట్టి ఇలాంటి జబ్బులేమైనా ఉంటే డాక్టర్‌ని సంప్రదించి తగు చికిత్స తీసుకోవటం తప్పనిసరి.