పొగతాగడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా 60 లక్షల మంది మరణిస్తున్నారని, ఈ మరణాలు అల్ప, మధ్యస్థాయి ఆదాయం కలిగిన దేశాల్లోనే ఎక్కువగా సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2030 నాటికి పొగాకు వినియోగ మృతుల సంఖ్య ఏడాదికి 80 లక్షలకు పెరిగే ప్రమాదముందని ఈ సంస్థ హెచ్చరించింది.
ఈ నివేదిక గురించి డబ్ల్యుహెచ్‌వో డైరెక్టర్ జనరల్ మార్గరెట్ చాన్ మాట్లాడుతూ, పొగాకు సంబంధిత అనారోగ్యం, మరణాలనుంచి తమ ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి దేశంపైనా ఉందని అన్నారు.
20వ శతాబ్దంలో పొగాకు వినియోగం వల్ల మొత్తం 10 కోట్లమంది మృత్యువాత పడ్డారు. పొగాకు వినియోగానికి సంబంధించి ప్రపంచ దేశాల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయని, దీని వినియోగాన్ని అడ్డుకోకుంటే ఈ దశాబ్దంలో పొగతాగి మరణించే వారిసంఖ్య వంద కోట్లకు చేరుకునే ప్రమాదముందని చాన్ హెచ్చరిస్తున్నారు.